మన ఊరి ఆరోగ్య వికాసం
అందరికీ ఆరోగ్యం .! అందరిదీ బాధ్యత .!
దోమల నివారణ చర్యలు
మన గ్రామములో కొనసాగుతున్న దోమల నివారణ చర్యలు , కట్టావారిపాలెం
శ్రీ కోటపాటి లక్ష్మీనరసింహం గారు
మలేరియాని నిర్మూలించాలి
దోమలవల్ల వ్యాప్తి చెందే ప్రాణాంతక అంటువ్యాధి మలేరియాని పూర్తిగా నిర్మూలించాలని ఆరోగ్య పర్యవేక్షకులు
ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవం సందర్భంగా గురువారం కట్టావారిపాలెంలొ స్తానిక స్వచ్చంద సంస్త మనఊరివికాసం నిర్వహించిన ర్యాలీలో పాల్గొని ప్రజలకు మలేరియా నివారణగురించి సూచనలిచ్చారు.
విద్యార్ధులు వినూత్న పధ్దతిలో గ్రామంలో దోమతెరలతో ప్రదర్శన చేసి ప్రజలు రాత్రి వేళల్లో తప్పక దోమతెరలు వాడాలని తెలియచేశారు.
మనఊరి ఆరోగ్య వికాసం కార్యకర్తలు మాట్లాడుతూ ప్రతి వారం గ్రామంలో దాతల సహకారంతో దోమలనివారణ చర్యలు చేపడుతున్నామనీ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి అంటు వ్యాధులు ప్రబలకుండా ప్రజలు సహకరించాలని విఙ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో యువకులు,ప్రజలు పాల్గొన్నారు.
“ఆరోగ్యమే మహాభాగ్యం-ఆనందమే సౌభాగ్యం”
దోమకాటుతో వచ్చే వ్యాధులు
దోమ సాధారణంగా ఎక్కడపడితే అక్కడ కనిపించే కీటకం. అది మనుషుల రక్తం తాగి బతుకుతుంది.
అయితే అలా అది రక్తం పీల్చేప్పుడు మన శరీరంలోకి కొన్ని క్రిములను కూడా విడుదల చేస్తుంది. ఆ క్రిముల వల్ల ఎన్నో వ్యాధులు వస్తాయి. వాటిలో ప్రధానమైనవి 1)మలేరియా 2)డెంగీ 3)చికున్ గున్యా 4)బోదకాలు 5)మెదడు వాపు
ఈ వారం మలేరియా వ్యాధి గురించి తెలుసుకోండి:
లక్షణాలు:
తీవ్రమైన చలిజ్వరంతో మొదలవుతుంది. తలనొప్పి, ఒంటినొప్పితో బాధపడతారు. లక్షణాలు ముఖ్యంగా మూడు దశలుగా గుర్తించవచ్చును.
1)చలిదశ : చలి, వణుకు, తలనొప్పితో బాధలు మొదలు అవుతాయి. రోగి దుప్పట్లు కప్పుకొంటాడు.. ఈ విధంగా 15 ని.ల నుండి 1 గంటవరకు ఉంటుంది.
2)వేడి దశ :శరీరమంతా మంటలతో తీవ్రమైన జ్వరం వచ్చును. తీవ్రమైన తలనొప్పి, వాంతి వికారములకు లోనవును. ఇది 2 నుండి 6 గంటల వరకు ఉండును. నాడి వాడిగా కొట్టుకుంటుంది. దప్పిక ఎక్కువ అవుతుంది.
3)చమటదశ :జ్వరం తగ్గుతుంది. చెమటలు పోస్తాయి. రోగికి నిద్ర కలుగుతుంది. తరువాత నీరసంగా వుంటుంది. ఇది 2 నుండి 4 గంటల వరకు ఉంటుంది.
రోజు విడిచి రోజు జ్వరం వచ్చుట,తలనొప్పి,వంటినొప్పి, ణుకుతో కూడిన చలి రావటం, మరియు చెమటలు, వాంతులు.
జ్వరానికి కారణం – ప్లాస్మోడియం అనే సూక్ష్మజీవి. రోగి శరీరంలో ఈ సూక్ష్మజీవులుంటాయి. అనాఫిలిసం జాతికి చెందిన ఆడ దోమ ఈ రోగిని కుట్టి రక్తంతోపాటు సూక్ష్మ జీవులను కూడా పీల్చుకుంటుంది. అలాంటి దోమ ఇతర ఆరోగ్యవంతులను మళ్ళీ కుట్టినప్పుడు వారికి సంక్రమిస్తుంది. వారికి 10 – 15 రోజుల తరువాత జ్వరం వస్తుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
జ్వరం వచ్చినప్పుడు రక్త పరీక్ష చేయించాలి. మలేరియా అని నిర్ధారణ అయితే క్రమం తప్పకుండా చికిత్స తీసుకోవాలి. రక్త పరీక్ష చేసే సదుపాయం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో లభిస్తుంది.
నివారణ చర్యలు:
దోమల ద్వారా ఈ జ్వరం వ్యాపిస్తుంది. కావున దోమలు పుట్టి పెరిగే స్థావరాలను అరికట్టాలి. నీరు నిలకడ ప్రదేశాలను పూడ్చి వేయాలి.
ఇంటిముందు సైడుకాలవల్లో చెత్త,ప్లాస్టిక్ సంచులు,గ్లాసులు వేయరాదు.
ఇంటి పరిసరాలలో గుంతలు గోతులు లేకుండా జాగ్రత్త పడాలి.ఇంటి బయటపడుకునేవారికి దోమ తెర, వంటి నిండా బట్ట ఉంచుకోవాలి
వేపనూనె ఒంటికి రాసుకుంటే దోమ కుట్టదు.
ఇంటిపై కప్పులో వున్న ట్యాంకులు (ఓవర్ హెడ్ ట్యాంకులు), నీటి కూలర్స్ మొదలగు నీటి తొట్లలో దోమలు పెరగకుండా చూసుకోవాలి.లెట్రిన్ ట్యాంకు గొట్టానికి తెరగుడ్డలు కట్టాలి.
ఎవరైనా ఎలాంటి జ్వరంతోనైనా బాధపడుచున్నచో ఏలాంటి మందులు తీసుకోకముందు పైనుదహరించిన కేంద్రాలకు వెళ్ళి వ్యాధి నిర్ధారణ కొరకు రక్త పరీక్ష చేయించుకోవాలి. వ్యాధి నిర్ధారణలో వచ్చిన జ్వరం మలేరియా మూలంగా అని తేలినచో, మలేరియా సిబ్బంది చికిత్స ప్రారంభిస్తారు. మలేరియా క్రిములున్న దోమ ఆరోగ్యవంతున్ని కుట్టినాక 10 నుండి 14 రోజుల వ్యవధిలో వ్యాధి లక్షణాలు బయటకువచ్చును.
గర్బిణీ స్త్రీలలో మలేరియా జ్వరం:
3నెలలు లోపు గర్బిణీ స్త్రీకి మలేరియా జ్వరం ఉన్నదని నిర్దారించినట్లయితే మలేరియా జ్వరానికి సంబంధించిన మందులు వడరాదు.
3 నెలలు దాటిన తర్వాత డాక్టరు సలహా తీసుకొని మాత్రమే మలేరియా జ్వరం చికిత్స చేయించాలి.
మెదడకు సోకే మలేరియా:
మలేరియా జ్వరంలో ప్రమాదకరమైనవి ప్రాణాంతకరమైనవి మెదడుకు సోకే మలేరియా
ప్లాస్మోడియం ఫాల్సిపేరమ్ అనే మలేరియా క్రిమి ద్వారా ఈ మెదడకు వచ్చే మలేరియా జ్వరం వ్యాపిస్తుంది.
ఈమలేరియా జ్వరం వచ్చిన వ్యక్తులకు ఫిట్స్ కూడా సాధారణంగా వస్తుంది.
తీవ్రమైన స్దితిలో మరణం కూడా సంభ విచ్చవచ్చు.కాబట్టి ఆలస్యం చేయుకుండా వ్యాధి నిర్ధారణ చేయించి సరియైన చికిత్స చేయించడం వలన ప్రాణాపాయి స్థితి నుండి కాపాడవచ్చు.
దోమకాటు రోగాలలో మలేరియా జ్వరం తరువాత మరో ప్రమాదమైన వ్యాధి డెంగీ జ్వరం.
దోమకాటు వలన సంక్రమించే వ్యాధులలో బోదకాలు వ్యాధి కూడా ఒకటి.ఈ వారం ఆరోగ్య సమాచారంలో బోదకాలు (Filariasis) గురించి తెలుసుకోండి.
డెంగీ జ్వరం లక్షణాలు, చికిత్స మరియు నివారణ మార్గాలు.
ఇప్పుడు దోమకాటు వలన వ్యాప్తి చెందే జ్వరాల్లో అతిగా ఆందోళనకు గురి చేస్తున్న అంశం డెంగీ జ్వరం. ఈ డెంగీ తో చాలా మంది తీవ్రమైన భాధను అనుభవిస్తున్నారు. కొంత మంది డెంగీ తీవ్రమై చనిపోతున్నారు. దీని నివారణకు వైద్యులు చాలా సలహాలు ఇస్తూనే ఉన్నారు. ఎందుకంటే డెంగీ వస్తే ప్రత్యేకమైన మందులు లేవు. లక్షణాలని బట్టి చికిత్స అందించాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. వర్షకాలంలో అపరిశుభ్ర పరిసరలాలలో ఉండే దోమలు కుట్టడం వలన డెంగీ జ్వరం వ్యాప్తిస్తుంది.
డెంగీ లక్షణాలు ఎలా ఉంటాయో ఒక్కసారి చదివి తెలుసుకోండి :
విపరీతమైన జ్వరం
చలి, తీవ్రమైన తల నొప్పి, ఒళ్లునొప్పులు
శరీరంపై దద్దుర్లు రావడం
విపరీతమైన దాహం వేయడం, నోరు ఎక్కువగా ఆరిపోతుంది
వాంతులు అవడం
కళ్లలో నొప్పి రావడం.
డెంగీ జ్వరం వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రతలు:
జ్వరం వచ్చిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల దగ్గరకు వెళ్ళాలి. పరీక్షలు చేయించకుండా మామూలు జ్వరానికి వాడే యాస్ప్రిన్, బ్రూఫిన్ మాత్రలు వాడకూడదు.
జ్వరం వచ్చిన వెంటనే చల్లని నీళ్లతో శరీరాన్ని ఒక గుడ్డతో బాగా తుడవాలి. ఎక్కువగా జ్వరం వచ్చిన వారిని చల్లని ప్రదేశంలో పడుకోబెట్టాలి. అలాగే జ్వరం నుండి ఉపశమనం కొరకు పారాసెట్మాల్ మాత్రను మాత్రమే వెయ్యాలి.
డెంగీ రావడం వలన శరీరంలో ఫ్లేట్ లెట్స్ తగ్గుతాయి. ఇలా తగ్గడం వలన రక్తం గడ్డకట్టి ఆగిపోతుంది. ఇలాంటి సమయంలో నొప్పుల ఎక్కువగా ఉన్నాయి అని నొప్పులు తగ్గే మాత్రలు వాడకూడదు.
ఒకవేల ఫ్లేట్ లెట్స్ తగ్గిపోయినప్పుడు వైద్యుల సలహా మేరకు మాత్రమే ఫ్లేట్ లెట్స్ ఎక్కించాలి.
బోదకాలు సమస్య క్యూలెక్స్
రకం దోమకుట్టటం వల్ల వస్తుంది.ఈ వ్యాధి ఫైలేరియా అనే సూక్ష్మక్రిమి ద్వారా సంక్రమిస్తుంది. ఇంటి పరిసరాల్లో ఉన్న మురుగునీటిలో గుడ్లు పెట్టి వృద్ధి చెందే క్యూలెక్స్ దోమ ద్వారా ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ఈ దోమలోని ‘మైక్రోఫైలేరియా’ క్రిములు మన శరీరంలో ప్రవేశించి మన లింఫ్ నాళాల్లో పెరిగి పెద్దవవుతాయి. అవి లింఫ్ గ్రంథుల్లో చేరి ఉండిపోతాయి. ఇవి అక్కడ పెద్దగా పెరగటం వల్లే మనకి బోదకాలు వస్తుంది. వీటి నుంచి వచ్చే కొన్ని విషతుల్యాల (Toxins) వల్ల లింఫు నాళాల్లో వాపు వస్తుంది. అలాగే ఈ క్రిములు చనిపోయి లింఫు నాళాల్లో అవరోధంగా మారటం వల్ల వీటికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు కూడా తోడవటం వల్ల కాలు వాపు, జ్వరం, గజ్జల్లో బిళ్లల వంటి బాధలు మొదలవుతాయి. ఈ బాధలు వచ్చిన ప్రతిసారీ నాలుగైదు రోజులుండి తగ్గిపోతాయి. కానీ మళ్లీమళ్లీ వస్తూనే ఉంటాయి. ఈ వ్యాధి ఎక్కువగా కాళ్ళకు మాత్రమే కాకుండా చేతులు, రొమ్ము, పురుషాంగాలకు, హైడ్రోసిల్, రొమ్ము భాగానికి, స్త్రీ మర్మాంగాలకు కూడా రావచ్చు.బోదకాలు లక్షణాలు ఉన్నవారు దగ్గరలోని ప్రభుత్వ వైద్యశాలలో రోగనిర్ధారణ చేయించుకుని ఉచితంగా వైద్యసేవలు పొందవచ్చు.
నివారణ చర్యలు:
1)రాత్రి వేళల్లో దోమతెరలు వాడాలి
2)ఇంటి పరిసరాల్లో మురుగు నీటినిల్వలు తొలగించాలి
3)జ్వరం వచ్చిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో రోగనిర్ధారణ చేయించుకోవాలి
మన కట్టావారిపాలెంలో మనఊరిఆరోగ్యవికాసం ఆధ్వర్యంలో దాతల ఆర్ధిక సహకారంతో దోమల నివారణకు ప్రతి వారం మందు చల్లుతున్న విషయం తెలిసిందే. గ్రామంలో దోమకాటు రోగాల నివారణకు ప్రజలు సహకరించాలని విఙ్ఞప్తి.
“ఆరోగ్యమే మహాభాగ్యం-ఆనందమే సౌభాగ్యం”
గ్రామంలో కొనసాగుతున్న దోమల నివారణ చర్యలు
దోమలు లేని ఊరు కానీ ,దోమకాటు ఎరుగని మనిషి కానీ ముఖ్యంగా భారతదేశంలో ఉండరు.కానీ దోమల బెడతకు నొచ్చుకుంటూనే దోమకాటును అందరూ తేలికగా తీసుకుంటారు.అన్నీ సందర్భాల్లో కాకపోయినా కొన్ని దోమలు మాత్రం ప్రాణాంతక వ్యాధులైన మలేరియా, డెంగ్యూ,చికున్ గున్యా,బోదకాలు,మెదడు వాపు వంటి అంటువ్యాధులను వ్యాప్తి చేస్తాయన్నది మాత్రం నిజం.ఈ వ్యాధుల బారిన పడి చనిపోయినవారు,ఆసుపత్రి పాలై ఆర్దికంగా నష్టపోయిన వారు ప్రతి గ్రామంలో ఉంటారు.
అందుకనే మన కట్టావారిపాలెం లో “మనఊరి ఆరోగ్య వికాసం” ఆధ్వర్యంలో ప్రతి వారం దోమల నిర్మూలనకు సైడుకాలువలు,నీటి నిల్వలు ఉన్నచోట మందు చల్లించడం జరుగుతున్నది.
గ్రామ ప్రజల సహకారంతోనే దోమకాటు రోగాలను పూర్తిగా నిర్మూలించగలం.
1) ఇంటి పరిసరాల్లో,ఇంటిముందు సైడుకాలవల్లో నీరు నిలవకుండా చూడాలి.
2) ఇంటిలోని చెత్త / చిమ్మిన కసువు,ప్లాస్టిక్ సంచులు,డిస్పోజబుల్ గ్లాసులు మొదలైనవి సైడుకాలవల్లో వేయరాదు.
3) ఇంటి ఆవరణలో పాత టైర్లు,తొట్లు, ప్లాస్టిక్ డబ్బాలు,వాడని రోళ్ళు తొలగించాలి.వాటిలో నీళ్ళు చేరి దోమలు గుడ్లు పెట్టి వ్యాప్తి చెందుతాయి.
4)కుటుంబసభ్యులు అందరూ రాత్రిళ్లు దోమతెరలు తప్పకుండా వాడాలి.
5)మరియు జ్వరంతో బాధపడేవారు నిపుణులైన వైద్యుల సలహా మేరకు రక్త పరిక్షలు చేయించుకుని చికిత్స పొందాలి.
6)పిల్లలకు,పెద్దలకు వెంటనే జ్వరాన్ని తగ్గించు ఇంజక్షన్లు చేయమని వైద్యులను వత్తిడి చేయరాదు.
7)సొంత వైద్యం ప్రమాదం.
పైవిధంగా గ్రామ ప్రజలు సహకరించి ఆరోగ్య కట్టావారిపాలెం నిర్మిస్తారని ఆశించుచున్నాము.
విద్యావంతులైన యువకులు తమ కుటుంబ సభ్యులకు పై విషయాలు అర్థమయ్యేలా వివరించి ఆచరించునట్లు చేయవలసిందిగా విఙ్ఞప్తి.